- పరీక్షల్లో ఫలితాలు సరిగ్గా రాకపోవడం కారణమైందంటూ సూసైడ్ నోట్
మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి:
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీలో మంగళవారం చోటుచేసుకున్న ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తిరుపతి జిల్లాకు చెందిన నాగమనయ్య కుమారుడు సిద్ధార్థ (18) ఉరివేసుకుని మరణించాడు. ఉపాధి కోసం సుమారు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన నాగమనయ్య కుటుంబం హెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. సిద్ధార్థ హబ్సిగూడలోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఐఐటీ ప్రవేశ పరీక్షలకు దీర్ఘకాల కోచింగ్ తీసుకుంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లగా, కళాశాలకు సెలవు ఉండటంతో సిద్ధార్థ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం 5.30 గంటల సమయంలో సిద్ధార్థ స్నేహితుడు అఖిల్ ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో అనుమానం కలిగింది. వెంటనే అఖిల్ విషయం సిద్ధార్థ తండ్రికి తెలిపాడు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో నాగమనయ్య, అఖిల్‌ను ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. ఇంటికి చేరుకున్న అఖిల్ తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో కిటికీ గుండా చూడగా… సిద్ధార్థ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి కిందకు దించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్ధార్థ రాసిన సూసైడ్ నోట్‌లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
