మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లా లో కేంద్రంలోని సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాలు ఉదృతం చేస్తామని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటీయు జిల్లా కార్యాలయంలో సావిత్రి బాయి పూలే గారి 195 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ లకు అన్ని రంగాలలో సమాన హక్కులు, అవకాశాల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. మనువాదులు మత విశ్వాసాలు రుద్దుతూ,నిరక్షరాస్యత,మూఢనమ్మకాలు అజ్ఞానం పట్టి పీడిస్తున్న ఆనాటి కాలంలోనే బ్రాహ్మణ ఆధిపత్య సమాజానికి వ్యతిరేకంగా,సాంప్రదాయ వాదుల నిర్బంధాలు, నిరంకుశ దాడులను ఎదిరించి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు స్థాపించి,ఎంతో మంది మహిళలకు ఆసరాగా నిలిచారని, ప్లేగు వ్యాధితో అల్లాడుతున్న ప్రజలను తన సొంత బిడ్డలుగా ఆదరించి మిషనరీలు స్థాపించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు.నేటి కాలంలో వారి స్త్రీలను కుటుంబాలకు చెందిన ఆస్తులుగా భావించే విధానాలకు స్వస్థి పలకాలని అన్నారు.సమాజం ఆధునికత చెందిన నేటి కాలంలో కూడా ఇప్పటికీ మహిళలపై సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీ ఆగడం లేదన్నారు.సమాజంలో లింగ వివక్షత ఇంకా తొలగిపోలేదని,అట్టడుగు కులాలకు చెందిన స్త్రీలు సమాజంలో గౌరవప్రదమైన హోదాకు నోచుకోవడం లేదని, దశాబ్దాల నుండి ప్రభుత్వాలు వేట్టి చాకిరీ చేయించుకుంటున్న గాని వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని విమర్శించారు.రాజకీయ రంగంలో పురుషుల పరోక్ష పెత్తనం పెరిగి రిజర్వేషన్ల అర్థమే మారిపోయిందని అన్నారు. నాడు విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సావిత్రి బాయి పూలే గారు ఆశిస్తే, నేటి ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరించి విద్యకు ప్రజలను దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నాడు మనువాదులు ఎన్ని ఆటంకాలు సృష్టించిన సావిత్రిబాయి పూలే సమరశీల పోరాటంతో స్త్రీజాతి అభివృద్ధి కోసం ఏ విధంగా పోరాడిందో నేడు అదే స్ఫూర్తితో, నేటి ప్రభుత్వాలు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్,స్కీం వర్కర్ల పేరుతో కార్మికులను దోచుకునే శ్రమ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, సమాన పనికి సమాన వేతనాలను సాధించడం కోసం మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సునీత,ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు పద్మ, కేబి సునీత, లక్ష్మి, పద్మ, సునీత, జయమ్మ,శ్రీదేవి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

