నేతన్నల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి
టీపీపీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :
పద్మశాలీలు కులస్తులు రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి రాజకీయంగా సత్తా చాటాలని మహబూబాబాద్ జిల్లా టీపీపీఎస్
అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కుల బాంధవుల భవిష్యత్తు, రాజకీయ ప్రాతినిధ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 మంది పద్మశాలీలు పోటీ చేసి, అందులో 20 మంది విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం పద్మశాలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక రాజకీయ నిధిని ఏర్పాటు చేయాలని, కులంలోని ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఉన్నత వర్గాల వారు ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఎదిగినప్పుడే కుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, పద్మశాలీల సంక్షేమం కోసం ఈ కింది డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి మండలం లోని నేతన్నలకు వ్యాపారాల కోసం ఎకరం భూమి కేటాయించాలి. పవర్ లూమ్స్ ఏర్పాటు, కమ్యూనిటీ భవనాల కోసం రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలన్నారు. చేనేత సహకార సంఘాల సొసైటీల బకాయిలను రద్దు చేసి, నేతన్నలను ఆదుకోవాలి. పద్మశాలీ టీపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి సేవలను గుర్తించి వారికి కార్పొరేషన్ పదవి కేటాయించాలని కోరారు. వారి కుటుంబం గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉందని, తన తండ్రి దివంగత రాంగోపాల్ 30 ఏళ్లు పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. తాను కూడా మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, గత 30 ఏళ్లుగా కుల ప్రతినిధిగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ కుటుంబాలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందిన పద్మశాలీలకు ఆయన అభినందనలు తెలిపారు. కుల బాంధవులంతా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

