Breaking News

అక్రమ అరెస్టులను తీవ్ర స్థాయిలో ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్:

మహిళా ఐఏఎస్ అధికారిపై మీడియాలో ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ యూనియన్ తీవ్రంగా ఖండిచింది. ఈ సందర్భంగా టిడబ్ల్యుజేఎఫ్ డివిజన్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో పాటు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు.సంస్థలో పని చేసే జర్నలిస్టులను, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేసి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.తమది ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన ప్రభుత్వంలోని అధికారులు అనుసరిస్తున్న విధానంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిజంలో మూడు దశాబ్ధాలుగా పని చేస్తున్న ఈ ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయటం వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు .సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సదరు జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి పోరాటం చేశారని తెలిపారు.
జర్నలిజం వృత్తిలో సరైన వేతనాలు లేకపోయినా…వృత్తి పట్ల ఆసక్తితో యాజమాన్యాలు చెప్పినట్లు పని చేయాల్సివస్తుందని అన్నారు. బలహీనవర్గానికి చెందిన ఈ ముగ్గురు జర్నలిస్టులను సిట్ అధికారులు అరెస్టు చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా అమాయక జర్నలిస్టులను అరెస్టు చేయడం సరైందికాదని, ఈ అక్రమ అరెస్టులు ఇతర జర్నలిస్టులను భయపెట్టేందుకు చేస్తున్న చర్యలని అన్నారు. ఈ సమావేశంలో టి డబ్ల్యూ జేఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు వరియోగుల మురళీధర్ స్వామి, జిల్లా కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ, డివిజన్ అధ్యక్షుడు గుర్రపు శ్రీనివాస్ డివిజన్ కార్యదర్శి జానవేణి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కొత్త పూర్ణచందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు చెరుకు సతీష్,, మీడియా కన్వీనర్ మార్క రాజు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..