- యువకుడు మృతి..
మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాపర్ :
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ (23) బుధవారం సాయంత్రం షామీర్పేట్ నుంచి భోగారం వైపు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వీస్ రోడ్డులోని స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో కుమార్ కొంత దూరం రోడ్డుపై జారిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో అధిక వేగంతో పాటు స్పీడ్ బ్రేకర్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు మాట్లాడుతూ, రాత్రి సమయంలో ఈ రోడ్డుపై సరిపడా వీధి దీపాలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహన దారులు వేగ పరిమితులు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ. లక్ష్మణ్ లు సూచించారు.

