మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:
_ అన్ని ప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యాలయాల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రతి విద్యార్థిపై దృష్టి సారించాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల హెచ్ఎంలు, బాధ్యులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డీఈఓ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మొత్తం 4,405 మంది విద్యార్థులు చదువుతున్నారని, మార్చి 14 వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత ఏడాది అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు.. ఎందరు పాస్ అయ్యారు.. ఎందరు ఫెయిల్ అయ్యారు.. దానికి కారణాలు ఏంటో అనే అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన దశ అని అన్నారు. ఈ దశలో చిన్న నిర్లక్ష్యం కూడా విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని అంకితభావంతో పని చేయాలని సూచించారు.ప్రతి పాఠశాలలో విద్యార్థులను సామర్థ్యాల ఆధారంగా విభజించి, బలమైన విద్యార్థులు, సగటు విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రోజువారీగా అదనపు బోధన తరగతులు, రిమీడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. రేపటి నుంచి పరీక్షల వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి పరీక్షల వరకు నిరంతర శిక్షణ అందించాలని పేర్కొన్నారు.పరీక్షల భయాన్ని విద్యార్థుల నుంచి తొలగించేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సాహకరంగా వ్యవహరించాలని అన్నారు. మోడల్ ప్రశ్నాపత్రాలు, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలతో విద్యార్థులకు విస్తృతంగా అభ్యాసం చేయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని సమీక్షించి, మార్కుల్లో మెరుగుదల కనిపించని చోట తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిరంతరం గైర్హాజరు అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడి, విద్యార్థులను పాఠశాలకు పంపేలా అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థుల చదువు, ప్రగతి, లోపాలపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, అందరి సహకారంతో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు.జిల్లాలోని ప్రతి పాఠశాల ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, పాఠశాలల పనితీరును పర్యవేక్షించాలని, అవసరమైన మార్గనిర్దేశనం అందించాలని ఆదేశించారు.పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు.
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయించాలి
జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర విద్యార్థులతో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రతి స్కూల్ లో ఎందరు విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారో చూడాలని, వారికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు, బ్యాంక్ ఖాతాలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల నుంచి వచ్చేలా, ఆన్లైన్లో అప్లై చేసేలా ప్రతి స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించి పనిని పూర్తి చేయించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఏ ఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, ఎంఈఓలు, డీసీఓలు, ప్రిన్సిపాల్ లు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

