Breaking News

శివ నామ స్మరణతో మార్మోగిన శివాలయాలు

-కోరిన కోర్కెలు తీర్చే పరమ శివుడి దర్శనానికి బారులుతీరిన భక్తులు.

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:

బోలా శంకరుడి అనుగ్రహం అందరి పై ఉండాలి

కరీంనగర్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.పాత బజార్ గౌరీ శంకరాలయం, మరియు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి.వేకువజాము నుంచే భక్తులు అభిషేకాలు,పూజలు నిర్వహిస్తున్నారు.మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి.తిమ్మాపూర్ మండలం ఎల్ ఎమ్ డీ కాలనీ లోని మృత్యుంజయ మహా దేవాలయంలో భక్తులు హర మహాదేవ శంభోశంకర ఓం నమ:శివాయ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.శివపార్వతులను పట్టు వస్త్రాలతో అలంకరించారు.ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ళు వేశారు.భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి శివపార్వతులను దర్శించుకున్నారు.మహాశివరాత్రి సందర్భంగా భక్తులు నిష్టగా ఉపవాస దీక్షలు చేపట్టారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు శివపార్వతులను స్మరిస్తూ ఉపవాసం చేస్తారు.ఆథ్యాత్మికత ఉట్టిపడేలా శివార్చన జరిగింది.సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపవాసాన్ని విడవనున్నారు.రాత్రంతా జాగారం చేస్తూ పరమశివున్ని స్మరించుకుంటారు. స్వామి వారి దర్శనానికి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.తెల్లవారు జామున 4 గంటల నుంచి ఆ పరమశివుని దర్శించుకునేందుకు శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు.భక్తులు ఆ పరమ శివునికి పూజలు, అభిషేకాలు చేసి తమ మొక్కులను పరమేశ్వరునికి సమర్పించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో,చుట్టు ప్రక్కల గ్రామాల నుండి తరలివచ్చి పరమ శివుడిని దర్శించుకున్నారు.శివపార్వతుల సన్నిధిలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది.జిల్లాలోని ప్రధాన శివాలయాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు,భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు త్రాగునీరు సౌకర్యం,మజ్జిగ ఏర్పాట్లను చేశారు.