Breaking News

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

.భక్తుల రద్దీతో కళకళలాడిన గోదావరి తీరం

మన ప్రగతి న్యూస్/కాళేశ్వరం:

బోలా శంకరుడి అనుగ్రహం అందరి పై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. అనంతరం గర్భగుడిలోని ద్విలింగాలైన శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పాలు, పెరుగు, తేనె, గంధం, పుష్పాలతో మహాభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రోజంతా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. గోదావరి తీరం భక్తుల రాకపోకలతో కళకళలాడింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూ లైన్ల ద్వారా శాంతియుతంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు రాత్రి జాగరణ చేసి భజనలు, శివనామ స్మరణతో పర్వదినాన్ని ఆచరించారు.
ఉత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, ప్రసాద పంపిణీ, వైద్య శిబిరం, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లు, సిబ్బంది భక్తులను క్రమబద్ధంగా దర్శనానికి పంపించారు.
మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఈ ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మికోత్సాహాన్ని రెట్టింపు చేశాయి. భక్తుల నినాదాలతో, దీపాల కాంతులతో, వేదఘోషలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.