- ఘటనపై కుషాయిగూడ డిపో మేనేజర్ సీరియస్.. డ్రైవర్ బర్తరఫ్!
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బస్సు ఎక్కుతున్న క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో ప్రమాదవశాత్తు కిందపడి, బస్సు టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాద ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ బస్టాప్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే..నాగార్జున నగర్, శుభోదయం కాలనీకి చెందిన చిట్యాల లక్ష్మి (64) మంగళవారం మధ్యాహ్నం 2:21 గంటల సమయంలో తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్టాప్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఈసీఐఎల్ నుంచి ఘట్‌కేశర్ వెళ్లే రూట్ నంబర్ 281 బస్సు (టి ఏస్ 03 జడ్ 0324) ఎక్కుతుండగా, డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును కదిలించారు. దీంతో లక్ష్మి ఒక్కసారిగా పట్టుతప్పి బస్సు మెట్లపై నుంచి కింద పడిపోయారు. అదే సమయంలో బస్సు వెనుక టైర్లు ఆమె పాదాలపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న ఆమె కుమారుడు చిట్యాల నరసింహ (39) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. నరసింహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు బస్సు డ్రైవర్‌ను ఉద్యోగం నుండి శాశ్వతంగా (పర్మినెంట్‌గా) తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రక్షణే తమకు ప్రాధాన్యమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

