- గౌడ వర్గం –ముదిరాజ్ వర్గాల మధ్య ఉద్రిక్తత
- పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం
మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి :
వర్గల్ మండలంలోని మసీద్‌పల్లి గ్రామంలో గౌడ సంఘం,ముదిరాజ్ వర్గాల మధ్య ఈతవనం భూమి వివాదం చెలరేగింది. జీవనోపాధిగా భావిస్తున్న ఈత చెట్లను ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు.గతంలో గౌడ సంఘానికి సంబంధించిన స్థలం సొసైటీ లేకపోవడంతో ఎల్లమ్మ గుడి ట్రస్ట్ పేరిట నమోదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటినట్లు చెప్పారు. మంజీరా పైప్‌లైన్ పనుల సందర్భంలో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వగా, మిగతా ప్రభుత్వ భూమిని ఎల్లమ్మ గుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు.అప్పటి మంత్రి, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు కూడా హాజరై మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇటీవల ఆ భూమి తమదేనంటూ ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసి ట్రాక్టర్‌తో కొన్ని ఈత మొక్కలను తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాలు రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెట్లు తొలగించిన వారిని గజ్వేల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై తెలిపారు. తొగుట సీఐ లతీఫ్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే గౌడ సంఘం సభ్యులు తమ జీవనాధారమైన ఈత చెట్లను ధ్వంసం చేయడం తీరని నష్టమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాం గౌడ్, గౌడ సంఘం నాయకులు జయ వెంకటస్వామి, నరేష్ గౌడ్, రవీందర్ గౌడ్, శివరాములు గౌడ్ మాజీ సర్పంచ్, రమేష్ గౌడ్,రంగ గౌడ్,మహేంద్ర గౌడ్, స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


