మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏఎస్ రావు నగర్‌కు చెందిన ఎ. ప్రమీల రాణి (65) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బద్దురు బ్రహ్మా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 25వ తేదీ రాత్రి 23:55 గంటల సమయంలో ఆయన వియ్యంకులు అవుల వెంకట్ రెడ్డి, భార్య ప్రమీల రాణితో కలిసి మోటార్ సైకిల్‌పై నేరేడ్మెట్ నుండి ఏఎస్ రావు నగర్ వైపు వెళ్తున్నారు. శారదా బస్ స్టాప్ జంక్షన్ వద్ద (రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా) వారు కుడి మలుపు తిరుగుతుండగా, వేగంగా వచ్చిన ఒక కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ రెడ్డి ఎడమ కాలు విరగగా, ప్రమీల రాణి తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిని వెంటనే ఈసీఐఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి ఎమర్జెన్సీ వార్డులో మృత్యువుతో పోరాడిన ప్రమీల రాణి, శుక్రవారం సాయంత్రం 16:12 గంటలకు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి కారణమైన కారును నేరేడ్మెట్ సాయినాథ్ పురంకు చెందిన దొడ్డల తరుణ్ (31) నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి బంధువు బ్రహ్మా రెడ్డి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

