Breaking News

కన్నతండ్రి ఇంట్లోనే కన్నం వేసిన దత్తపుత్రుడు !

  • నమ్మించి మోసం చేసిన వైనం.. రూ. 10.20 లక్షల ఆస్తి రికవరీ
  • కుషాయిగూడ పోలీసుల చాకచక్యంతో 48 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

పెంచి పెద్ద చేసిన తండ్రి ఇంట్లోనే పక్కా ప్లాన్‌తో భారీ చోరీకి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కారు కొని ట్రావెల్స్ వ్యాపారం చేయాలనే దురాశతో, సొంత కుటుంబ సభ్యులనే నమ్మించి నిలువునా ముంచాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ దొంగతనం కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఉప్పల్ డివిజన్ డీసీపీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఘటన నేపథ్యం: కుషాయిగూడకు చెందిన జూపూడి ఆనంద్ గుప్తా (55) వ్యాపార వేత్త. గత నెల 28న ఉదయం 11:30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ బంధువుల శుభకార్యానికి వెళ్లారు. వేడుక ముగించుకుని సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలోని లాకర్ పగులగొట్టి ఉండటం, బంగారు ఆభరణాల పెట్టెలు చిందరవందరగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. సుమారు 38 తులాల బంగారం, 3.7 కిలోల వెండి మరియు రూ. 2.45 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐదు రోజుల ముందే స్కెచ్..


కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఇంట్లోకి చొరబడిన విధానాన్ని పరిశీలించిన పోలీసులకు, తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఆనంద్ గుప్తా దత్తపుత్రుడైన తమ్మినేని తిరుపతి రెడ్డి అలియాస్ మహీందర్ గుప్తా (28) కదలికలపై ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. నిందితుడు తిరుపతి రెడ్డికి సొంతంగా కారు కొని ట్రావెల్స్ బిజినెస్ చేయాలని ఆశ కలిగింది. ఇందుకోసం ఇంట్లోనే చోరీ చేయాలని ఐదు రోజుల ముందే ప్లాన్ వేసి, రహస్యంగా ఇంటి ప్రధాన ద్వారం నకిలీ తాళం చెవి తయారు చేయించాడు.
సినిమా ఫక్కీలో చోరీ:

బైక్ దొంగలు అరెస్ట్,రిమాండ్ కు తరలింపు:

ఫిబ్రవరి 28న కుటుంబ సభ్యులందరినీ తన బావ కారులో ఫంక్షన్ హాల్ వద్ద దింపిన నిందితుడు, ఎవరికీ అనుమానం రాకుండా మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు. తన దగ్గరున్న నకిలీ తాళంతో తలుపులు తీసి క్షణాల్లో నగదు, నగలను దోచుకున్నాడు. అనంతరం మళ్ళీ ఏమీ తెలియ నట్లుగా ఫంక్షన్ హాల్‌కు చేరుకుని అందరితో కలిసిపోయాడు.

రికవరీ చేసిన సొత్తు:

నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ. 10.20 లక్షల విలువైన ఈ క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు: బంగారం: కాసుల హారం, నల్లపూసల గొలుసు, బ్రాస్‌లెట్లు, నెక్లెస్‌లు, 11 ఉంగరాలు, గోల్డ్ బిస్కెట్ సహా మొత్తం 18 రకాల ఆభరణాలు. వెండి: 2.5 కిలోల వెండి ఇటుకలు, 500 గ్రాముల నాణేలు, వెండి బిందె (మొత్తం 3.7 కిలోలు). నగదు: రూ. 2,13,000/- నగదు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన కుషాయిగూడ ఇన్ స్పెక్టర్ మరియు సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.