Breaking News

ఊయలే ఉరితాడుగా.. ఎనిమిదేళ్ల బాలిక మృతి

  • కాప్రాలో విషాద ఘటన.. తల్లి బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం

మన ప్రగతి న్యూస్ /జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

ఆడుకోవాల్సిన వయసులో ఆ ఊయలే ఆ పాపకు కాలపాశమైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెద్ద కుమార్తె కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదిస్తోంది. కాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.?వివరాల్లోకి వెళ్తే.. టి. నవనీత అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు పవిత్ర (8), ఆరాధ్య (7 నెలలు)తో కలిసి కాప్రాలో నివసిస్తోంది. భర్తతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న ఆమె, గృహ సేవకురాలిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. కాగా, పెద్ద కుమార్తె పవిత్ర గత పది రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఒక్క గంటలో అంతా తారుమారు.. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో.. నెల జీతం తీసుకునేందుకు నవనీత సమీపంలోని ఒక ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పవిత్ర తన ఏడు నెలల చెల్లెలి కోసం చీరతో కట్టిన ఊయల వద్ద ఆడుకుంటోంది. సుమారు గంట తర్వాత తల్లి తిరిగి వచ్చి చూసేసరికి.. ఊయల కోసం కట్టిన చీర పవిత్ర మెడకు గట్టిగా చుట్టుకుని ఉంది. ఆమె గాలి ఆడక ఊయల నుంచి వేలాడుతూ కనిపించడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం..వెంటనే స్థానికుల సహాయంతో బాలికను లైఫ్‌లైన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పవిత్ర మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిపాప మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తిమ్మారావుపేటలో దోమల నియంత్రణకు ఫాగింగ్ ను సర్పంచ్ సుమలత పర్యవేక్షణ