Breaking News

వేములవాడ దర్గా తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దర్గా తరలింపు వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దర్గా తరలింపునకు సంబంధించిన నిర్ణయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు సీఈఓ, వేములవాడ ఆలయ కార్యనిర్వహణాధికారి, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.వేములవాడ దర్గా తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ నజీమా అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి బి. విజయ్ సేన్రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, వేములవాడకు భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనలో భాగంగా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను మరిన్ని సదుపాయాలతో మరో ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఈ చర్యలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే చేపడుతున్నామని, ఏ మతానికీ విరుద్ధంగా వ్యవహరించడం లేదని ఆయన తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తరలింపు చర్యలు కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు.

వేములవాడలో లాడ్జిలో యువకుడి హత్య కలకలం