- కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. అక్కడిక్కడే మృతి
మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి రాగానే, వేగంగా వచ్చిన ఒక చెత్త లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో రవీందర్ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రవీందర్ లారీ వెనుక టైర్ల కింద పడిపోవడంతో, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరార్.. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి ఘటనా స్థలం నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కీసర పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

