Breaking News

ప్రేమకు అడ్డుందని కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె!

  • గోడల మధ్యే సమాధి.. పైన సిమెంటు పూడ్చివేత
  • జవహర్‌నగర్ హత్య కేసు మిస్టరీ వీడింది: నిందితుల అరెస్ట్

మన ప్రగతి న్యూస్ /జవహర్‌నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

నవమాసాలు మోసి, రక్తపానాన్ని పాలుగా ఇచ్చి పెంచిన కన్నతల్లి అని కూడా చూడకుండా.. తన ప్రేమకు అడ్డు పడుతోందన్న కసిని పెంచుకుంది ఓ కుమార్తె. ప్రియుడితో కలిసి పథకం వేసి, తల్లిని అతి కిరాతకంగా చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన అమానుష ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బుధవారం మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్ ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు.
ఘటన నేపథ్యం: కౌకూర్ భరత్‌నగర్‌కు చెందిన అంజు (40) పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. ఆమె చిన్న కుమార్తె (17) ఇంటర్ చదువుతున్న సమయంలో బీహార్‌కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. మైనర్ అయిన తన కుమార్తెతో మోంటీ పరిచయాన్ని తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో గతంలో మోంటీపై రెండుసార్లు పోక్సో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని వదిలించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం హత్య..
గత ఏడాది మే 12న పథకం ప్రకారం.. ఇంట్లో దాగి ఉన్న మోంటీ, మైనర్ బాలిక సంకేతం ఇవ్వగానే అంజుపై దాడి చేశాడు. కుమార్తె తల్లిని గట్టిగా పట్టుకోగా, మోంటీ కత్తితో ఆమె గుండెల్లో పొడిచి ప్రాణాలు తీశాడు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని బెడ్ కింద దాచి, ఆనవాళ్లు లేకుండా గదిని శుభ్రం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైన సిమెంటు, ఇసుకతో పక్కాగా పూడ్చివేశారు. ఎలుకల వల్ల నేల పాడైందని ఇరుగుపొరుగును నమ్మించి రిపేరు చేయించారు. తల్లి అదృశ్యం కేసుతో మొదలై.. తల్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో, పెద్ద కుమార్తె రోషిణి అక్టోబర్ 2025లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘మహిళ అదృశ్యం’ కేసు నమోదైంది. పోలీసుల లోతైన దర్యాప్తులో మోంటీ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. హత్య అనంతరం నిందితులిద్దరూ కలిసి జీవిస్తూ, ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారని, ప్రస్తుతం వారికి రెండు నెలల బాబు ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్ట్: నిందితుడి ఒప్పుకోలుతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మోంటీ కుమార్ సింగ్ మరియు మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

శాంతియుత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలి