Breaking News

భూబకాసురుల గుట్టురట్టు!

  • ఖైదీలైన ఖాకీ అధికారి, మరో ఎనిమిది మంది
    నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. కీసర పోలీసుల చాకచక్యం

మన ప్రగతి న్యూస్ /కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

అమాయకుల భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కాజేయాలని చూసిన భారీ భూకబ్జా ముఠాను కీసర పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ముఠాలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మరణ ధృవీకరణ పత్రాల నుంచి కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ల వరకు అన్నింటినీ ఫోర్జరీ చేస్తూ, యజమానులకు తెలియకుండానే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులతో సహా పలువురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 16, 17 తేదీల్లో కేశబోయిన రమాదేవి, మదాను మాధురి అనే మహిళలు తమ భూములను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు బదలాయించారని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. మృతుల పేరిట మాయాజాలం..ఈ ముఠా ప్రధానంగా ఖాళీగా ఉన్న ప్లాట్లను, యజమానులు అందుబాటులో లేని భూములను లక్ష్యంగా చేసుకుంటుంది. మొదట అసలు యజమానుల వివరాలు సేకరించి, వారు చనిపోయినట్లు నకిలీ ‘డెత్ సర్టిఫికేట్లు’ సృష్టిస్తారు. ఆపై నకిలీ వారసులను పుట్టించి, గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్లు, సేల్ డీడ్ల ద్వారా భూములను తమ అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తారు.
ముఠాలో పోలీసు అధికారి..
రెండు వేర్వేరు కేసుల్లో (క్రైమ్ నెంబర్ 241/2026, 248/2026) పోలీసులు నిందితులను గుర్తించారు. మొదటి కేసులో కనకాటి లింగయ్య గౌడ్ (ఏఎస్ఐ), ప్రవీణ్ రెడ్డి, మోడెమ్ సంపత్, కాంబ్లే దీపలను అరెస్ట్ చేయగా.. రెండో కేసులో ఉప్పల వేణు, దొనపాటి వెంకట్ రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ
భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి అని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ సూచించారు. కేసును త్వరితగతిన ఛేదించిన జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి బృందాన్ని ఆయన అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

శాంతియుత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలి