మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన ఏ. చందన అనే విద్యార్థిని సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా బేస్ బాల్ కార్యదర్శి అర్జున్ తెలిపారు. ఈ విద్యార్థిని ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఈనెల 24 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు.పదవ తరగతికి చెందిన చందన అనే విద్యార్థిని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అత్యున్నత ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొనడం గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువులోనే కాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ రకాల క్రీడల్లో జాతీయ స్థాయి కోచ్ లచే శిక్షణను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. గతంలో సైతం పారా అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయి క్రీడల్లో ఈ పాఠశాల విద్యార్ధి రాణించడం విశేషం.జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని, భవిష్యత్తులో పోలీస్ అధికారినిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం తన లక్ష్యమని కుమారి చందన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినిని, శిక్షణను అందించిన కోచ్ అన్వేష్ ని పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, రియాజ్, రాజేష్, మధు, పృద్వి లతోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

