మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ఈనెల 14 (శనివారం)న జిల్లాలోని 125 విద్య సంస్థలలో పండుగ వాతావరణం లో కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలనీ
గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాలు,పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారని,
అందుకు అనుగుణంగా విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానాలు పంపాలని, విద్యా సంస్థ ఆవరణలో శానిటేషన్ చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరమైన భోజనం సిద్ధం చేయాలని సూచించారు.
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల పై ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధనలు అందించుటకు కృషి చేస్తుందని, అందులో భాగంగా నే జిల్లాలో ప్రతి హాస్టల్ కి ఒక అధికారిని నియమించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రణాళిక ప్రకారం విద్యార్థుల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేస్తూ ఉన్నామని తెలిపారు.
జిల్లాలో పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో, (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి,జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సైదా నాయక్, సిపిఓ సుబ్బారావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, డిపిఓ హరిప్రసాద్,
అన్ని మండలాల నుండి వచ్చిన ప్రిన్సిపల్స్, వార్డెన్లు, ఎంపిఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.