_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
_ గోశాలలో ప్రతి కోడె, ఆవు వివరాలు ప్రతి రోజు రిపోర్ట్ చేయాలి.
_ కలెక్టర్ అనుమతి లేకుండా మూడవ దశ పంపిణీ ఎలా జరిగింది? నివేదిక అందించాలి
_ పంపిణీ చేసిన 1975 పశువుల ప్రస్తుత స్థితి గతుల పై శుక్రవారం నాటికి నివేదిక అందించాలి
_ కోడెలు, ఆవుల పంపిణీ చేసే లబ్దిదారుల జాబితా పై కలెక్టర్ సంతకం లేనంత వరకు జాబితా ఫైనల్ కాదు
_ వేములవాడ ఆలయ గోశాల పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
మన ప్రగతి న్యూస్/
రాజన్న సిరిసిల్ల,
రాజన్న దేవాలయం గోశాలకు సంబంధించిన కోడెల పంపిణీకి జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని, అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలో గోవులను పంపిణీ చేసేందుకు వీలులేదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో వేములవాడ ఆలయ గోశాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇక నుండి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలో గోశాల నుంచి కోడెలను, ఆవుల రైతులకు పంపిణీ చేసేందుకు వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు 1975 పశువులను గోశాల నుంచి పంపిణీ చేశామని, వీటిలో మొదటి దశలో 1278 కోడెలు, 75 ఆవులు, రెండవ దశలో 389 కోడెలు, 45 ఆవులు, మూడవ దశలో 188 కొడెలు పంపిణీ చేసామని అధికారులు వివరించారు.
మొదటి, రెండు దశలకు మాత్రమే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని పంపిణీ చేయగా, కలెక్టర్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా మూడవ దశ పంపిణీ ఎలా జరిగిందని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.మూడవ దశ పంపిణీకి గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.
వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో పంపిణీ చేసిన 1975 పశువుల స్థితి గతుల పై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పశువులకు పంపిణీ చేసే సమయంలో వాటికి ట్యాగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం, పోలీస్ సిబ్బంది విచారించి ఎంపిక చేసే వరకు ఏ లబ్ధిదారుడికి గోశాల నుంచి పశువులను ఇతర జిల్లాలకు పంపిణీ చేసేందుకు వీలు లేదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రతి రోజు వేములవాడ లోని 2 గోశాలలు, ఆలయ ఆవరణలో గల కోడెలు, ఆవులు ఇతర పశువుల వివరాలు తెలియ జేయాలని కలెక్టర్ తెలిపారు. కోడెలు, ఆవుల పంపిణీ చేసే లబ్దిదారుల జాబితా పై కలెక్టర్ సంతకం లేనంత వరకు జాబితా ఫైనల్ కాదని స్పష్టం చేశారు.వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి వారం రివ్యూ సమావేశం ఉంటుందని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరగాలని, ఎక్కడ ఎటువంటి అవకతవకలు ఉండటానికి వీలులేదని, ఆలయానికి సంబంధించిన ప్రతి అంశం తన దృష్టికి రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్,
వేములవాడ ఆలయ ఇంచార్జి ఈఓ రాజేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి డిపిఆర్ఓ వి శ్రీధర్ వేములవాడ తాసిల్దార్ మహేష్ ఉన్నారు.