వారంలో పనులను పూర్తి చేయాలి – మంత్రి తుమ్మల.
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
సీతారామ ప్రాజెక్ట్, రాజీవ్ లింక్ కెనాల్ పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఏన్కూర్ మండలం హిమాంనగర్ దగ్గర లింక్ కెనాల్ పనులను పరిశీలించారు. గ్యాస్ లైన్ దగ్గర కాలువను మళ్లించే సొరంగం పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ లింక్ కెనాల్ పనులను వారం పది రోజుల్లో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలను కాపాడుకునేందుకు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు ఈ లింకు కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హెవీ వాటర్ ప్లాంట్ కు, ఐటీసీకి, భద్రాచలం పట్టణానికి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉందని అయితే, డిమాండ్ కు తగ్గట్లుగా నీళ్లు అందుబాటులో లేవన్నారు. మరోవైపు నాగార్జునసాగర్ లో కూడా నీళ్లు లేక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఇబ్బందులన్నింటిని అధిగమించాలంటే ఇరు జిల్లాల కలెక్టర్లు రాజీవ్ సాగర్ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోత్ శోభన్ నాయక్, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.