మన ప్రగతి న్యూస్/హత్నూర:

చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో గల భీముని చెరువులో శుక్రవారం చోటు చేసుకుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం బోర్పట్ల గ్రామంలో గత రెండు రోజులుగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కొత్తగడికి చెందిన ప్రేమ్ కుమార్ (35) బోర్పట్ల లో జరుగుతున్న జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు డప్పు నవీన్ కుమార్(25) ఇంటికి బంధువుగా వచ్చాడు.అయితే వీరిద్దరూ స్నానం చేసేందుకు గ్రామ సమీపంలోని భీముని చెరువుకు వెళ్ళారు.చెరువులో దిగి స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీటి మునిగి గల్లంతయ్యారు. ఎంతో సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టు మీద వారి దుస్తులు కనిపించాయి.

చెరువులో నీట మునిగి ఉంటారని కుటుంబీకులు బోరున విలపించారు.స్థానిక తహసీల్దార్ ఫర్హీన్ షేక్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే దాకా మృతదేల కోసం ముమ్మరంగా గాలించారు అయినప్పటికీ వారి మృత దేహాలు లభ్యం కాలేదు.
