కొత్త కారు కొన్న ఆనందం కాసేపైనా నిలబడలేదు ..!
మన ప్రగతి న్యూస్/ ఢిల్లీ : ఆరంభమే… అంతిమపాదం అన్న చందంగా … కొత్త కారు కొన్న ఆనందం కాసేపైనా నిలబడలేదు ..! ఓ మహిళ కొత్త కారును కొన్న ఆనందంలో మొదట నిమ్మకాయను తొక్కించాలని కారును ఎక్కింది.. పొరపాటున యాక్సిలేటర్‌పై కాలేసింది.. ఇంకేముంది ఆ కారు కాస్తా మొదటి అంతస్తు నుండి కిందకి పడి తుక్కయ్యింది..!
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.స్థానిక మీడియా కథనాల ప్రకారం … ఢిల్లీ ఘజియాబాద్‌లోని మాని పవార్ అనే మహిళ ఇటీవల రూ.27 లక్షల విలువైన మహీంద్రా థార్ కారును ఆర్డర్ చేశారు. సోమవారం కొత్త కారును తీసుకోవడానికి ఆమె మహీంద్రా షోరూమ్, నిర్మాణ్ విహార్‌కి వెళ్లారు. కొత్త కారును బయటకు తీసుకెళ్లే ముందు పూజ చేయాలని మని పవార్ భావించారు. ఈ సందర్భంగా, షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఆమె థార్ ఎస్‌యువి తో నిమ్మకాయలను తొక్కించారు. అయితే, అనుకోకుండా పొరపాటున ఆమె యాక్సిలేటర్‌ను నొక్కడంతో, వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకేముంది … ఆ కారు షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దూసుకెళ్లింది. వాహనం షోరూమ్‌లోని అద్దాలను బద్దలుకొట్టుకుంటూ, కింద ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో మని, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్, షోరూమ్ సిబ్బంది థార్‌లో ఉన్నారు. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం … ఎయిర్‌బాగ్‌లు పనిచేశాయి కాబట్టి వారందరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బతుకు జీవుడా అని బయటపడ్డారు..! ప్రమాదం వెంటనే, బాధితులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందజేశారు.
