ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ
ఉదయం 09.30 గంటల తరువాత అనుమతి లేదు
మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అనుమతి లేదు
మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు
మన ప్రగతి న్యూస్ /ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల
ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలోని అన్ని కేంద్రాల్లో గ్రూప్ -3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అబ్జర్వర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపర్ఇండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కు గురువారం శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీ పీఎస్సీ ఆదేశాల మేరకు జిల్లాలో నవంబర్ ఆదివారం 17 ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 03.00 నుంచి 05.30 వరకు, 18 సోమవారం ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నమని తెలిపారు. పరీక్షకు మొత్తం 7062 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. మహిళలు 3359, పురుషులు 3701, ట్రాజెండర్స్ 02 పరీక్షలు రాయనున్నారని వివరించారు.
ప్రతి అభ్యర్థిని తప్పనిసరిగా తనిఖీ..
పరీక్ష కేంద్రంలో అధికారులు నిర్వర్తించాల్సిన, నిర్వర్తించకకూడని విధులపై వివరించారు. ప్రతి అభ్యర్థిని తప్పనిసరిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే కేంద్రంలోనికి అనుమతించాలని స్పష్టం చేశారు.
అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్..
అభ్యర్థులు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారని, ముందుగానే కేంద్రానికి చేరుకుంటే సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సమయం తెలుసుకునేందుకు బెల్ ఉంటుందని స్పష్టం చేశారు.
జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు..
ఉదయం 09.30 గంటల తరువాత, మధ్యాహ్నం 02.30 గంటల తరువాత అభ్యర్థులకు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం సిరిసిల్ల నియోజకవర్గం లో 18 కేంద్రాలు, వేములవాడ నియోజకవర్గం లో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు ప్రభుత్వ పాఠశాలలు, ఏడు ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలాల్లో రెండు చొప్పున, అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం డిగ్రీ కళాశాల, ఏడు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం అబ్జర్వర్స్ 25, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 25 చీఫ్ సూపర్ఇండెంట్స్ 25, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 05, దివ్యాంగుల కేంద్రాలు 02 ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షకు ఒక రోజు ముందు అన్ని పరీక్ష కేంద్రాల్లో గదులు, ఇతర ఏర్పాట్లు తనిఖీ చేయాలని సూచించారు.
సమన్వయంతో పనిచేయాలి
అన్ని పరీక్ష కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది మందులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్ లు వేయాలని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఆయా కేంద్రాల్లో పరిశుభ్రత పనులు, తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జీరాక్స్ సెంటర్లు మూసి ఉంచుతామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి అధికారి, సిబ్బందికి ఐడీ కార్డు ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రానికి ఎస్ఐ నీ కేటాయించామని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్స్ ఉండేలా చూసుకోవాలని ఆర్ సీ ఓ కు సూచించారు.
పరీక్ష మొదలైన తర్వాత ముగిసే వరకు ఎవరూ బయటికి వెళ్ళడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సరి చూసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్సీఓ, జేఎన్టీయూ అగ్రహారం కళాశాల ప్రిన్సిపాల్స్ , జిల్లా అధికారులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.