మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
విజ్ డమ్ హైస్కూల్ మరియు ప్రీ స్కూల్ లో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలే ఉపాధ్యాయులుగా మారి బోధనలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ సారయ్య మాట్లాడుతూ బాల బాలికల్లో నిద్రాణమై ఉన్న శక్తులను వెలికితీయడానికి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుటకు ఇట్టి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు నేరుగా బోధనా పద్ధతులను తెలుసుకోవచ్చని, తద్వారా వారు అన్ని రంగాల్లో రాణించగలుగుతారని వారు తెలిపారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పినట్లు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, మన దేశ అభివృద్ధి పిల్లలైన మీ పైనే ఆధారపడి ఉందని, విద్యార్థులు బాల్య దశ నుండే క్రమశిక్షణతో తల్లిదండ్రులు, గురువులు బోధించిన మార్గంలో నడవాలని తద్వారా తమకు ఉజ్వల భవిష్యత్తు సాకార మవుతుందని ఎంఈఓ తెలిపారు. స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో డిఈఓ గా సిద్రా మాహీన్, ఎంఈఓ గా అన్వేష్, కరస్పాండెంట్ గా సాయికిరణ్, ప్రిన్సిపాల్ గా అర్జున్, వైస్ ప్రిన్సిపాల్ గా సాయి తేజ, అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జిగా విఘ్నేశ్వరి, డాక్టర్లుగా సిరి, తరుని వైష్ణవి, కీర్తన రెడ్డి, అశ్వక్ లతో పాటు పి ఈ టి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులుగా మారి బోధించిన విధానం ఎంతగానో అలరించింది. అన్ని వృత్తుల కెల్లా అధ్యాపక వృత్తి అత్యుత్తమమైనదని, అన్ని వృత్తులను తయారు చేసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే సొంతమని బోధనలోని మాధుర్యాన్ని తాము ఎంతగానో ఆస్వాదించినట్లు విద్యార్థి ఉపాధ్యాయులు తెలియజేశారు.150 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన గావించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ & ప్రిన్సిపాల్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అడ్మినిస్ట్రేటివ్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.