భూమి హక్కు పరీక్షలు చేయించుకోవాలి
రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్
మనప్రగతిన్యూస్ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
భూ చట్టాలపై రైతులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ రైతులకు సూచించారు. సాగుయాత్రలో భాగంగా సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు, పాలకుర్తి రైతు వేదికలలో వ్యవసాయ శాఖ సౌజన్యంతో లిప్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ ఆర్డిఓ డిఎస్ వెంకన్న, పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్, రైతు కమిషన్ అధికారి మహేష్ లతో కలిసి భూమి సునీల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది భూపరీక్షలు చేపట్టే తరహాలో భూమి తన పేరున ఉందా లేదా అనే భూమి హక్కు పరీక్షలను రైతులు చేయించుకోవాలని సూచించారు. భూ చట్టాలన్నీ రైతులకు చుట్టాలుగా చేయడమే లక్ష్యమన్నారు. భూమి సమస్యలను పరిష్కరించుకోవడం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగితే రైతు చట్టాలను ఆశ్రయించాలని తెలిపారు. సాగునీటి సమస్య పరిష్కారం, బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకోవడం, పంటల భీమా చేయించుకోవడం, బూచట్టాల్లో భాగమేనని తెలిపారు. మార్కెట్ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూ చట్టాలు దోహదపడతాయని తెలిపారు. నకిలీ విత్తనాలతో పంటలు దిగుబడి తగ్గడం, విత్తనాలు మొలకెత్తకపవడంతో రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా రైతులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే భూ చట్టాల ద్వారా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులకు భూచట్టాలే కీలకమని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెయ్యి గ్రామాల్లో సాగుయాత్రను నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాలలో సాగుయాత్రను పూర్తి చేశామని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుయాత్రను ప్రారంభించామని అన్నారు. డిసెంబర్ 10 నాటికి సాగుయాత్రను హైదరాబాదులో ముగిస్తున్నామని అన్నారు. అనంతరం భూమి సునీల్ ను ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్, మండల వ్యవసాయ అధికారి సింగారపు కరుణాకర్ లతోపాటు ఏఈవోలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లిప్స్ సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు జీవన్, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, రవి, సందీప్, ఏఈఓ జాటో రాధిక, సువర్ణ తోపాటు రైతులు పాల్గొన్నారు.


