మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ నేత సామినేని రామారావు హత్య అత్యంత దారుణమని పేర్కొన్న కవిత, త్వరలో రాష్ట్ర పోలీసు ప్రధానాధికారిని కలిసి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం కోరుతానని తెలిపారు. నిందితులు ఎవరైనా తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.జిల్లా అభివృద్ధి మందగించడం మంత్రుల మధ్య సమన్వయం లోపం వల్లేనని కవిత విమర్శించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ప్రజలు కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్నారని గుర్తుచేశారు. జలగం వెంగళరావు వంటి మహానీయులను అందించిన ఖమ్మం జిల్లా ఉద్యమ చరిత్రలో అగ్రశ్రేణి స్థానాన్ని సంపాదించిందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాకు అభివృద్ధి దిశగా ముందడుగు తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకుల వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.సామాజిక తెలంగాణ నెలకొనేందుకే తమ పోరాటం కొనసాగుతోందని కవిత స్పష్టం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉద్యోగ రంగాలలో అన్ని వర్గాలు ఎదగాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే నిజమైన సామాజిక తెలంగాణ సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ వర్గాలకు కేవలం ఒక్క మంత్రి మాత్రమే ఉండటం తగదని ఆమె విమర్శించారు.ఆడపిల్లల వసతి గృహాల్లో పైకప్పులు కూడా లేని స్థితి ఏర్పడినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అధికారం, అవకాశం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు సాగుతామని కవిత తెలిపింది.
తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు పార్టీని విడిచిపెట్టడం వల్లే బీఆర్ఎస్ బలహీనపడిందని ఆమె అన్నారు. గ్రామ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మార్కెట్ కమిటీల్లో పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు.స్థానిక సంస్థల ఎన్నికలను నలభై రెండుశాతం రిజర్వేషన్లతో నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి, అక్కడి విధానాల్లో ఒక్కటి అయినా అమలు చేశారా అని ఆమె ప్రశ్నించారు.రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని కవిత తీవ్రంగా విమర్శించారు.


