వైభవంగా ఊరేగింపు
భక్తుల సందోహం
మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
జైపూర్ మండల కేంద్రంలోని శ్రీ దేవి–భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం మరింత వైభవంగా కొనసాగాయి. ఉదయం నేరాజనసేవలతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భూదేవి–శ్రీదేవి సమేత మాలయప్ప స్వామివారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
కళ్యాణ దర్శనానికి జైపూర్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. వేదపండితుల వేదఘోష, మంగళ వాద్యాలు, అలంకార మంటపం—ఈ అన్నీ కలసి కళ్యాణోత్సవానికి మరింత గాంభీర్యం తెచ్చాయి..కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో రథంపై గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరోగింపు కార్యక్రమం భక్తులను ఉర్రూతలూగించింది. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలు ఆడుతూ, యువత భజనలు చేస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. “గోవింద… గోవింద…” నినాదాలతో గ్రామం మార్మోగింది.,బ్రహ్మోత్సవాల అనంతరం నిర్వాహకుల్లో అరవింద్‌రావు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పూజా కార్యక్రమాలు జమ్మికుంటకు చెందిన అర్చకులు రామాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జైపూర్ పరిసర గ్రామాల భక్తులు విస్తృతంగా పాల్గొని స్వామివారి దివ్య ఆశీర్వచనాలు పొందారు.
