Breaking News

100 వారాల అఖండ భక్తి దేవునిపల్లిలో సామూహిక హనుమాన్ చాలీసాకు శతకోత్సవం

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి పట్టణం నాలుగో వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. గ్రామ భక్తుల నిత్య సేవాభావానికి నిదర్శనంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 100వ వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రారంభించిన రోజు నుండి ప్రతి శనివారం ఒకటే భక్తిభావం, ఒకటే సంకల్పం… అదే శక్తిగా నిలిచి ఈ శతవారోత్సవాన్ని గొప్పగా చేసిందని గ్రామ హనుమాన్ భక్త బృందం ప్రకటించింది. ఉదయం నుంచే హనుమాన్ స్వామి దేవాలయం పరిసరం పావన వాతావరణంలో ముంచెత్తింది. భక్తుల ఉత్సాహం, పారాయణ ధ్వనులు, ‘జై హనుమాన్ జ్ఞాన గుణ సాగరా…’ అంటూ వినిపించిన భక్తి ఘోషలతో దేవునిపల్లి గ్రామమంతా భక్తిరసంతో మార్మోగిపోయింది. పెద్దలు, యువత, చిన్నారులు, మహిళలు అందరూ ఒకే చోట ఒకే ధ్యేయంతో చేరి ఈ ఆధ్యాత్మిక సేవలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ హనుమాన్ భక్త బృందం మాట్లాడుతూ… పూర్తి 100 వారాల పాటు ప్రతి శనివారం భక్తులు స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం నిజంగా దేవుని కృపతో సాధ్యమైంది. గ్రామంలో సమైక్యత పెరగడంలో, యువతలో ఆధ్యాత్మిక స్పూర్తి పెంపొందడంలో ఈ పారాయణం కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తునికి ప్రసాదంగా అరటి పండ్లను పంపిణీ చేశారు. మరుక్షణం ప్రయోజనాలకోసం కాదు, స్వచ్ఛమైన భక్తికి నిదర్శనంగా ఈ సేవ కొనసాగుతుందని భక్తులు అభిప్రాయపడ్డారు. దేవునిపల్లిలో 100వ వారాన్ని సాధించడం గ్రామానికి గర్వకారణమని పెద్దలు ప్రశంసలు కురిపించారు. తదుపరి వారాలు కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే భక్తినిబద్ధతతో కార్యక్రమాన్ని కొనసాగించాలని భక్తబృందం సంకల్పం వ్యక్తంచేసింది.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..