- న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ విజయంతో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్..
- టీ20 చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు..
- సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలిచిన మొద టి ఆతిథ్యదేశంగా టీమిండియా చరిత్ర..
- మొత్తం మూడుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఏకైక జట్టుగా అవతరణ..
- టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో 8 మ్యాచ్‌లలో 7 విజయాలు నమోదు..
మన ప్రగతి న్యూస్/అహ్మదాబాద్:
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్ లో ని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆది వారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన భారత్, విశ్వవిజేతగా నిలిచింది. 202 3లో ఇదే మైదానంలో ఎదురైన పరాజ యాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ, లక్షలాది మంది అభిమానుల సాక్షి గా టీమిండియా విజయ కేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాల తో మార్మోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గానే కాకుండా, ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేసింది.
ఒకే విజయంతో మూడు రికార్డులు..
ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు ద్వారా టీమిండియా ఒకేసారి మూడు అరుదైన మైలురాళ్లను అధిగమించింది.
- టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టు..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ వరుసగా రెండుసార్లు కప్పు గెలవలేదు. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు 2026లో కూడా టైటిల్ గెలిచి, టైటిల్‌ను డిఫెండ్ చేసు కున్న తొలి పురుషుల జట్టుగా రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.
- సొంతగడ్డపై గెలిచిన తొలి ఆతిథ్య జట్టు..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఉన్న ఓ పెద్ద సెంటిమెంట్‌ను భారత్ బద్దలు కొట్టింది. 2007లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఆతిథ్య దేశం కూడా సొంత గడ్డపై కప్పు గెలవ లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ఆతిథ్యం ఇచ్చినా కప్పును ముద్దా డలేకపోయాయి. కానీ 10వ ఎడిషన్‌కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్, సొంతగడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
- మూడుసార్లు విశ్వ విజేతగా..
ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో అత్య ధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2007 లో ధోని సేన తొలి కప్పు గెలవగా, 2024 లో రెండో సారి, ఇప్పుడు 2026లో మూడో సారి టైటిల్ సాధించి ‘హ్యాట్రిక్’ కొట్టింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ చెరో రెండు సార్లు గెలవగా, భారత్ మూడు టైటిళ్లతో అందరికంటే ముందుంది.
జైత్రయాత్ర సాగిందిలా..
ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 8 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిం చింది. ఫిబ్రవరి 7 న ముంబైలోని వాంఖ డే స్టేడియంలో అమెరికాపై 29 పరుగుల గెలుపు తో భారత్ తమ వేటను ప్రారం భించింది. అనంతరం ఫిబ్రవరి 12 న ఢిల్లీలో నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫిబ్రవరి 15 న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకి స్థాన్‌పై 61 పరుగుల భారీ విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచింది.
అయితే, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఏకైక పరాజయం ఎదురైంది. కానీ ఈ ఓటమి నుంచి వెంటనే తేరు కున్న టీమిండియా, ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకె ళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
అక్టోబర్ 2023 నుంచి తిరుగులేని ఫామ్..
టీమిండియా ఈ టోర్నీకి ముందు నుంచే అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన గత 56 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఏకంగా 48 విజయాలు నమోదు చేయ డం విశేషం. వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత్, ఫైనల్ పోరులో అదే జట్టు ను చిత్తుచేసి విశ్వవిజేతగా అవతరించింది. మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన టీమిండి యా, టీ20 క్రికెట్‌లో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

