మన ప్రగతి న్యూస్ /ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిర్జాదిగూడ-పర్వతాపూర్ రహదారిపై గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే: ఎస్టీఎఫ్ ‘ఏ’ టీం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం పర్వతాపూర్ రోడ్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కుమ్మరి గోపి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద 1.3 కేజీల గంజాయి లభ్యమైంది.
దీనితో పాటు, ఈ అక్రమ విక్రయాల్లో సంబంధం ఉన్న మున్నా అనే మరో వ్యక్తిపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు అంజిరెడ్డి తెలిపారు. గంజాయి విక్రయదారులు మరియు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

