మన ప్రగతి న్యూస్ /ఘట్‌కేసర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కీసర మండలం రాంపల్లి పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని తారక ఎన్‌క్లేవ్, శ్రీధన్వి హెవెన్ అపార్ట్‌మెంట్‌లోని రూమ్ నంబర్ 501లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం సదరు నివాసంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుద్దెడ కార్తీక్ గౌడ్ అలియాస్ చిన్నా అనే వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి 550 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఒక వివో మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సిద్దిపేట జిల్లా ఖాదర్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు (క్రైమ్ నెంబర్ . 25/2026) చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. గంజాయి ఎక్కడి నుండి తెచ్చారు?ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

