భూదాన్ నిర్వాసితుల కన్నీరు తుడిచేందుకు సిద్ధమైన…
ముగ్గురు మంత్రులు.. నేడే పట్టాల పంపిణీ…
ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందే…
“వెలుగుమట్ల”ఇండ్ల బాధితులకు విముక్తి…
311 మందికి పట్టాలు,ఇందిరమ్మ ఇల్లు…
మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు అందజేత…
మన ప్రగతిన్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా “మార్చి 15లోపు మీకు పట్టాలిస్తాం.. అండగా ఉంటాం” అని వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇచ్చిన హామీ అక్షర సత్యం కాబోతోంది. మాట ఇస్తే మడమ తిప్పని నేతగా పేరున్న ఆయన, తాను విధించుకున్న గడువు కంటే నాలుగు రోజుల ముందే బాధితుల కష్టాలను తీర్చేందుకు సిద్ధమయ్యారు. నేడు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ వేదికగా భూదాన్ నిర్వాసితుల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మాట ఇచ్చారు.. ముందే నెరవేరుస్తున్నారు
దళారుల ఉచ్చులో చిక్కి, గూడు కోల్పోయి, చీకట్లో మగ్గుతున్న వెలుగుమట్ల బాధితుల సమస్యను మంత్రి పొంగులేటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల జరిగిన ముఖాముఖిలో వారి గోడును విని చలించిపోయిన ఆయన, వెనువెంటనే అధికారులను రంగంలోకి దింపారు. రాజకీయాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకమైన సర్వేను పూర్తి చేయించి, నిజమైన నిరుపేదలను గుర్తించారు. బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
ఒకే వేదికపై రెట్టింపు ప్రయోజనం
మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో బాధితులకు కేవలం స్థలమే కాకుండా, ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా మంజూరైంది. ఈ ప్రక్రియలో భాగంగా 311 మందికి ఇంటి స్థలం లేని వారికి ‘పట్టా’తో పాటు ‘ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం’ ఇస్తారు. 101 మందికి ఇప్పటికే స్థలం ఉన్న వారికి నేరుగా ‘ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం’ అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ యోగం కలగబోతోంది.
దళారీ వ్యవస్థకు చెక్.. పేదలకు అండ
పేదల రక్తం తాగే దళారీ వ్యవస్థపై మంత్రి పొంగులేటి ఉక్కుపాదం మోపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావులేకుండా నేరుగా మంత్రులే బాధితుల చేతికి పట్టాలు ఇస్తుండటం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఇచ్చిన మాట కంటే ముందే బాధితులకు న్యాయం చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

