•పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి నిరాశ..
•వైద్యసేవల కోసం గర్భిణుల ఆవేదన..
మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో కూడా సరైన వైద్యసేవలు అందక బాధితులు ఆందోళన చెందుతున్నారు. గురువారం రుద్రంగి గ్రామానికి చెందిన గౌతమి అనే గర్భిణికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.అయితే ఆసుపత్రిలో మహిళా వైద్యురాలు అందుబాటులో లేరని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రసవానికి అవసరమైన వైద్యసేవలు ఇక్కడ అందుబాటులో లేవని, వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ పరిణామంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చినా చికిత్స అందక మరో చోటుకు తరలించాల్సి రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో మహిళా వైద్యురాలు లేక ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడల్లా సిరిసిల్లకు వెళ్లాలని సూచించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో సమయానికి వైద్యసేవలు అందక ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తక్షణమే మహిళా వైద్యురాలిని నియమించి గర్భిణులకు సరైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.


