ఆహార నాణ్యతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఫోకస్
కుళ్లిన ఆహార విక్రయాలపై కఠిన హెచ్చరిక
మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
వేములవాడ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో మంగళవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న పలుచోట్ల హోటళ్లను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, తయారీ ప్రక్రియలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కిచెన్ ప్రాంతాల పరిశుభ్రత, వంటగదుల్లో ఉపయోగిస్తున్న నీటి స్వచ్ఛత, వాడుతున్న నూనెల స్థితి, గడువు ముగిసిన పదార్థాల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని చోట్ల ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడంపై నిర్వాహకులను హెచ్చరించారు.కుళ్లిన, పాడైపోయిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని స్పష్టం చేస్తూ, అలాంటి పదార్థాలు కనుగొనబడితే వెంటనే పారవేయాలని ఆదేశించారు.అలాగే వంటగదులు, పాత్రలు, నిల్వ గదులు నిత్యం శుభ్రంగా ఉంచాలని, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

