ముస్లిం సోదరులకు పోలీస్ శాఖ తరుపున రంజాన్ శుభాకాంక్షలు
జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
మన ప్రగతి న్యూస్ నల్గొండ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దావతే ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి అధికారులు ఇఫ్తార్ విందులో పాల్గొని సౌహార్ద వాతావరణాన్ని చాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆమెర్,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులు, ముస్లిం మత గురువులు మరియు ఇతరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ పండుగ మనుషుల మధ్య ప్రేమ, ఐక్యతను పెంపొందించే పవిత్ర సందర్భంగా అభివర్ణించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం ముస్లిం మత గురువులు ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమం స్నేహభావ వాతావరణంలో ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు,మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు, ఆర్.ఐలు,ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

