- మెదడులో రక్తం గడ్డకట్టడమే కారణమని వైద్యుల వెల్లడి
- పాఠశాల యాజమాన్యంపై తల్లి అనుమానం.. కేసు నమోదు
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
పాఠశాల ప్రాంగణంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా ఆదర్శ్ నగర్‌కు చెందిన బ్రహ్మదండి జ్యోతి కుమారుడు సూరజ్ కుమార్ (14) వాసవి శివనగర్‌లోని గోపీ మెమోరియల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీ ఉదయం పాఠశాలలో ఉండగా సూరజ్ కుమార్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక కొరల్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున సూరజ్ మృతి చెందాడు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్లే మరణం సంభవించిందని తెలిసింది. అదే రోజు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, తన కుమారుడి మృతిపై తల్లి జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రాంగణంలో అసలేం జరిగిందనే కోణంలో విచారణ చేపట్టాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యఫ్ఐఆర్ 239/2026, యు/ఎస్ 106(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పాఠశాల యాజమాన్యాన్ని, తోటి విద్యార్థులను విచారిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

