మన ప్రగతి న్యూస్ / నర్మెట్ట:
చేర్యాల మండలం ముస్తల గ్రామంలో ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసింది. గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డిని గత ఏడాది నుండి ప్రేమించుకుంటూ హైదరాబాదులో కలిసి నివసించారు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి రాగా, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని కొంతకాలం వేరువేరుగా ఉండాలని, అనంతరం వివాహం జరిపిస్తామని నిర్ణయించారు.
ఈ క్రమంలో గత నెల 28-న రాకేష్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ గత నెల 30-న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న హారిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తరువాత నర్మెట్ట మండల కేంద్రంలోని తన అమ్మమ్మ కొన్నే లక్ష్మి ఇంటికి వచ్చిన హారిక, గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న పైపుకు తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అమ్మమ్మ గమనించి వెంటనే కిందకు దింపినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది.రాకేష్ రెడ్డి మృతిని జీర్ణించుకోలేక మానసిక ఆవేదనతో ఈ దారుణానికి పాల్పడినట్లు మృతురాలి తల్లి తరిగొప్పుల కవిత ఫిర్యాదు చేసింది. ఘటనపై నర్మెట్ట ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
