Breaking News

కాల్చొద్దు.. కలియదున్నండి….

  • వరి కొయ్యల దహనంతో నేలకు, పర్యావరణానికి తీవ్ర అనర్థాలు
  • స్పష్టం చేస్తున్న నిపుణులు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ కార్యాచరణ

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శిక్షణ పొందుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థినిలు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా ఆబాది గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాలతో వరి కోతలు ముగిసిన వెంటనే కొయ్యలను రైతులు దహనం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఊరూరా ఇదే ప్రక్రియ జరుగుతోంది. వరికోతలకు యంత్రాలను వినియోగిస్తుండడంతో.. పొలాల్లో ఎత్తయిన కొయ్యలు మిగిలిపోతున్నాయి. రెండో పంట వేసేందుకు వీలుగా.. వాటిని రైతులు తగలబెడుతున్నారు. దీంతో భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గి.. కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక టన్ను వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల 10 కిలోల కార్బన్మోనాక్సైడ్ తో పాటు 1400 కిలోల కార్బన్లక్సైడ్ గాలిలో కలుస్తోందని.. దీంతో వాయు కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • కారణాలు నష్టాలు

యంత్రాలు.. వరిని మొదలు భాగంలో కాకుండా 300 సెంటీమీటర్ల ఎత్తుతో కోస్తున్నాయి. దీంతోపాటు గడ్డి అక్కడే పడిపోతోంది పశువుల మేత కోసం ఎండుగడ్డిని, కట్టలు కట్టే ప్రక్రియ సరిగా సాగక 50 శాతం పొలంలోనే ఉండిపోతోంది. ఎకరాకు 2 టన్నుల మేర అలా పాలంలో మిగిలిపోతోంది. ఈ తరుణంలో అధిక శాతం రైతులు గడ్డిని, కొయ్యలను తగలబెడుతున్నారు. కొయ్యల దహనం వల్ల తదుపరి పంట సీజను సాగు సజావుగా సాగుతుందని బావిస్తున్నారు.. వరికొయ్యలను కాల్చే సమయంలో మంటలు చుట్టుపక్కల పొలాలకు అంటుకుంటున్నాయి. ఇతర పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు ప్రమాదాల భారిన పడుతున్నారు. గత ఏడాది ఒక రైతు చనిపోయారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం
  • నిపుణులు ఏం చెబుతున్నారంటే…

ఢిల్లీలో చలికాలంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సమస్యకు వచ్చిన పంజాబ్, హరియానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమనే విషయం తెలిసిందే. రాష్టంలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. భూసారం తగ్గడంతో పాటు.. నేల పొరల్లో తేమశాతం అవిరై దిగుబడులపై ప్రభావం పడుతుందని స్పష్టంచేస్తున్నారు. “వరిని కోసిన వెంటనే నేలలో మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల కొయ్యలు మట్టిలో కలిసి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో నేలలో పగుళ్లు వచ్చి.. వర్షపు నీరు నేలలోకి ఇంకుతుంది. తద్వారా నేల కోతకు గురికాదు. తదుపరి నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు.. ఎకరాకు 50 కిలోల సూపర్ పాస్పేట్ వేయడం వల్ల కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థంగా మారుతుంది. దీంతో దిగుబడి సైతం పెరుగుతుంది. టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2 కిలోల నత్రజని, 11 కిలోల భాస్వరం, 16.9 కిలోల పొటాషియంతో పాటు సూక్ష్మపోషకాలు అవసరం వరికొయ్యలను భూమిలో కలిపిదున్నడం వల్ల ఈ పోషకాలన్నీ తిరిగి నేలకు చేరతాయి. లేదంటే పంట వ్యర్ధాలను కంపోస్ట్ పద్ధతితో సేంద్రియ ఎరువుగా మార్చవచ్చు” అని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రభాకర్ రెడ్డి వివరించారు.

  • రైతులకు అవగాహన కల్పిస్తాం

రైతులు వరి వంట కోశాక.. కొయ్యలను కాల్చడం అన్ని విధాల నష్టదాయకం. వరి కొయ్యలు భూమిలో కుళ్ళి పోయేలా కలియదున్నాలని అవగాహన కలిపిస్తున్నాం .
ఈ కార్యక్రమంలో రైతులు కొమురయ్య, రవీందర్, విద్యార్థినిలు వాసవి, ప్రవళిక ,మౌనిక,నవ్య, నిషిత,పావని,ప్రగతి , సాత్విక పాల్గొన్నారు.