మన ప్రగతి న్యూస్/కేసముద్రం :
కేసముద్రం మునిసిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం విధి విధానాలలో భాగంగా కేసముద్రం మండలంలోని 5 గ్రామాలలో జిల్లా అధికారుల ఆదేశానుసారం విలీన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించగా అన్ని గ్రామాలలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సానుకూలంగా స్పందించడంతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయడంలో భాగంగా బుధవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో 5 గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు నాయకులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీగా జీవో అందజేయగానే అన్ని గ్రామాలు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేసముద్రంను మున్సిపాలిటీగా చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని, ప్రజలు నాయకులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళిక బద్దంగా నడుచుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ ఏర్పాటు గురుకుల పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడమే కాకుండా రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, ఉప్పరపల్లి, కేసముద్రం విలేజ్ లలో సబ్ స్టేషన్ ల ఏర్పాటు, హాస్పిటల్, బైపాస్ రోడ్డు లాంటి ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, 8 నెలల్లోనే మున్సిపాలిటీ యొక్క అభివృద్ధిని చూస్తామని, అభివృద్ధి కొరకు ఇప్పటికే 70 నుండి 80 కోట్ల వరకు నిధులు విడుదల చేయనుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇప్పుడున్న కేసముద్రం రూపురేఖలు మార్చుకొని అభివృద్ధి దిశగా పయనించాలన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకున్నారే తప్ప ఏమి చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్, మండల వాస్తవ్యులు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ ఆకాంక్ష తీర్చినందుకు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తానని చేయలేకపోయిన మున్సిపాలిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజలు, నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ సభ్యులు దస్రు నాయక్, బండారు వెంకన్న, బండారు దయాకర్, పట్టణ అధ్యక్షులు రావుల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓలం రమేష్, చిదురాల వసంతరావు, ఆయూబ్ ఖాన్, యాదగిరి, సామల నరసయ్య, పోలేపాక నాగరాజు, వేముల శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం సుధాకర్ రెడ్డి, కొండా సురేష్, భానోత్ చిన్న వెంకన్న, సామ సుధాకర్ రెడ్డి, పోలేపల్లి వెంకటరెడ్డి, కనుకుల రాంబాబు, అజ్మీర రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.