Breaking News

రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపేదల బియ్యం గద్దల పాలు..!

  • రైస్ మిల్లులు, కోళ్ల పరిశ్రమలకు తరలింపు
  • ఎల్లలు దాటుతున్న పేదల బియ్యం
  • నిఘా కన్నుగప్పి దారి మళ్లుతున్న వేలాది క్వింటాళ్లు
  • అడపాదడపా తనిఖీలు,కేసుల నమోదు తో సరిపెడుతున్న పోలీసులు
  • అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాలని అంటున్న ప్రజలు

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు. స్థానిక అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోతుండగా జిల్లా కేంద్రం నుంచి విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి దాడులు జరిపితే తప్ప పెద్ద ఎత్తున పట్టుబడిన దాఖలాలు లేవు.పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుండడంతో రేషన్‌
బియ్యం అక్రమ రవాణా వైపు చూసే వ్యాపారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.


ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నది. అక్రమ దందాను వ్యాపారంగా మార్చుకున్నారు.
అక్రమ రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛ‌గా సాగిపోతుంది. రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండాపోయింది. అధికారులతో చేతులు కలిపి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ అక్రమ రవాణా య‌థేచ్ఛ‌గా జరుగుతుందని ఫిర్యాదులు వచ్చిన ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

మామూళ్ల మత్తులో పోలీసులు…..

రేషన్ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతుంది.?ఎంత మొత్తంలో పక్క దారి పడుతుంది.? అందులో ఎవరి పాత్ర ఎంత అనే విషయాలు చాలా వరకు పోలీసులకు తెలిసే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రతీ నెల బియ్యం మామూళ్లు నెల జీతాల కన్న ముందే అందుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బియ్యం వ్యాపారులు పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బులు చూపి వారి పనులు చేసుకుంటారు అని ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

బియ్యం తరలింపు ఇలా…

బియ్యం అక్రమార్కులు డీలర్లు,కార్డు దారుల నుండి ప్రతీ నెల 5వ తారీకు నుండి 15 తేది వరకు సేకరణ చేస్తారు.వీరికి కిలోకి రూ. 10 నుండి రూ. 15 వరకు చెల్లిస్తారు.సేకరించిన బియ్యాన్ని ఒక చోట డంపు చేసి తరలింపు పాయింట్ నుండి క్లియరెన్స్ వచ్చాక వాహనాల ద్వారా తరలించి రైస్ మిల్లులకు, పౌల్ట్రీ ఫామ్ లకు తీసుకెళ్లి అక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తారు.

అక్రమార్కులపైన ఉక్కు పాదం మోపాలి…

పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్గంలో సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, గట్టి నిఘా ఏర్పాటు చేసి పటిష్టం చేయాలని ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.