- మరో యువకుడికి తీవ్ర గాయాలు.. కుషాయిగూడ పీఎస్ పరిధిలో విషాదం
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీఐఐసీ కాలనీకి చెందిన సాలిమెట్ల నాని (21), తన స్నేహితుడు అశోక్ యాదవ్‌తో కలిసి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:45 గంటలకు) యమహా ఎంటి బైక్ (టీజీ08ఎఎం7097) పై ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ నుండి రాధికా థియేటర్ వైపు వెళ్తున్నారు. పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, నానికి తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని సమీపంలోని శ్రీకార రాఘవేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ నాని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన అశోక్ యాదవ్ ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి బావ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

