తండ్రి ప్రోత్సాహంతో నాటక రంగ ప్రవేశం
మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్

ఆమె ….చక్కని ఆహార్యంతో రంగస్థల వేదిక పైకి ప్రవేశిస్తే ప్రేక్షకులు …మై మరిచిపోతారు ఆమె నటన సౌరభవం రంజింప చేస్తుంది.స్త్రీ, పురుషుల పాత్ర ఏదైనా అలవోకగా జీవం పోసి రాణిస్తారు. సజీవదృశ్యమైన నాటకం తన ప్రాణంగా కళను పోషిస్తున్నారు. అక్షరజ్ఞానం లేని కళాకారిణి పద్యాలను సులువుగా చెప్పడం లో ఆమెకు ఆమె సాటి.పౌరాణిక నాటకంలో పద్యం పాడితే ప్రేక్షకులు పరవశించి పోతారు,ఒదిగి పోతారు. ఆమె ఎవరో కాదు ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం ఎర్రబంజర్ గ్రామానికి చెందిన నంద్యాల సక్కు అలియాస్ సత్య కుమారి. పౌరాణికం, సాంఘికం, జానపద నాటకాలు, బుర్రకథలు ఇలా అన్ని రంగాల్లో ముప్పై ఏళ్లుగా అపత్రిహాత ప్రదర్శనలతో జాతీయ స్థాయి అవార్డులు సాధిస్తూ కళామతల్లి ముద్దుబిడ్డగాజిల్లాకు వన్నె తీసుకొచ్చారు.

తండ్రి నుంచి అందిపుచ్చుకున్న కళ
పైళ్ళ రాఘవులు నాటకరంగ కళాకారుడు. ఆయన ఆరో సంతానంగా పుట్టిన సక్కును చిన్ననాటి నుంచి నాటకాల వద్దకు తండ్రి వెంట వెళ్లే వారు. దీంతో నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. స్వతహాగా రంగస్థలం ప్రవేశం ఉన్న కుటుంబం కావడం, కళపై అభిమానం, తండ్రి ప్రోత్సాహంతో వీరయ్య నాయుడు, పిచ్చేశ్వరరావు గురువుల వద్ద శిక్షణ తీసుకొని ఆమె కూడా తన పదిహేనో ఏటే రంగస్థలంపై కాలు మోపారు. ఆనాటి నుంచి విభిన్న పాత్రలను పోషిస్తూ పలువురి ప్రశంసలతోపాటు అనేక బిరుదులు, సత్కారాలు పొందారు. జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సైతం గెల్చుకున్నారు. ఒక్కో ఏడాదిలో అరవైకిపైగా ప్రదర్శనలు చేస్తూ నాటకరంగంలో రాణిస్తున్నారు.
ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాత్రలు

సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రకు ఎక్కువ బహుమతులు తెచ్చి పెట్టాయి. బ్రహ్మం గారి నాటకంలో ఆదాంబీ, ఈశ్వరీ పాత్రలతో పాటు, రామాంజనేయ యుద్ధం నాటకంలో శాంతిమతి, తిరుపతమ్మ నాటకంలో తల్లి పాత్ర, పూలరంగడు నాట కంలో ఎస్సై పాత్ర ఇలా లింగబేధం లేకుండా కళాభిమానులను అలరించే పాత్ర లతో ఆహుతులను మెప్పిస్తున్నారు .
అవార్డులు.. బిరుదులు
2016లో కళాసౌరభ అవార్డు అందు కున్నారు. 2017లో విశాఖపట్నంకు చెందిన మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఉగాది పురస్కార్, 2018లో
వే ఫౌండేషన్ జాతీయ స్థాయి కళాకారిణి అవార్డును, 2023 మార్చి 18 వ తారీఖున కళావాణి బిరుదు బంగారు అంగుళీకం అందుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు లభించాయి. గాంధర్వ గాయని, గాన సుధ, నటగానమంజరి, జూనియర్ గూడురు సావిత్రి, కళ సౌరోభామ, నటగాన కోకిల, నాట్య మయూరి, మాధుర్యగాన కోకిల, కళావాణి బిరుదులు అందుకున్నారు.
కళలను ప్రోత్సహించాలి
రంగస్థలంలో అత్యంత ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తున్న సత్యకుమారి కళాభిమానాన్ని పొందారు.అంతరించిపోతున్న నాటక రంగంలో మొక్క వోని దీక్షతో నాటకాలను ప్రదర్శిస్తూ మన్న లను పొందుతున్నారు, నాటక రంగ కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని ఆమె కోరుతున్నారు. పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ తమ పాత్రను బ్రతికిస్తున్న కళా శిరోమణి నంద్యాల సత్యకుమారి కళాకారులకు స్ఫూర్తినిస్తుంది.