మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్:
- గత 6 నెలల నుంచి లేని హెల్పర్
- హెల్పర్ లేక పని భారం అధికమైందని అంగన్వాడీ టీచర్ ఆవేదన
- వెంటనే హెల్పర్ పోస్ట్ భర్తీ చేయాలని డిమాండ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాజ్ పల్లి తండా సెంటర్ నెంబర్ 6 అంగన్వాడి కేంద్రంలో 40 మంది పిల్లల స్ట్రెంత్ ఉంది. హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె రిటైర్ అవడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. హెల్పర్ పోస్టు ఖాళీ అయ్యి ఆరు నెలలు గడుస్తున్న ఇంకా ఆ పోస్టు భర్తీ కాకపోవడంతో అంగన్వాడి టీచర్ హెల్పర్ పనులు చూసుకుంటుంది. అంగన్వాడి సెంటర్ ఉడ్చుకోవడం తో మొదలై పిల్లలకు వంట చేసి పెట్టె వరకు అన్ని పనులు తానే చేసుకుంటున్నానని అంగన్వాడీ టీచర్ రేణుక తెలిపారు. అంగన్వాడి సెంటర్లో నీళ్ల సమస్య ఉందని, పిల్లలకు అంగన్వాడీ కేంద్రానికి తానే తీసుకురావాలని మళ్లీ ఇంటి వద్దకు తానే విడిచి పెడుతున్నానని వాపోయారు. ఈ సెంటర్ తో పాటు మరొక సెంటర్ ఇన్చార్జి గా అదనపు బాధ్యతలు తనకు అప్పగించారని పని భారం అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే హెల్పర్ పోస్ట్ ను భర్తీ చేయాలని, అలాగే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.