మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా వైరస్ తర్వాత.. కొత్త కొత్త వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో మరో కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది.
ఈ వైరస్ మన దేశంలో ఓ మహిళకు నిర్ధారణ అయ్యింది. కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు సోమవారం హ్యూమన్ కరోనావైరస్ HKU1 ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మహిళ గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్ కరోనా వైరస్’ (హెచ్‌కేయూ1) నిర్ధారణ కావడంతో కొంత ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్ ఉంచినట్టు వైద్యులు తెలిపారు.
హెచ్‌కేయూ1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్‌కేయూ1 అనేది కరోనా వైరస్‌లోని ‘బీటా కరోనా వైరస్ హాంకానెన్స్’ రకానికి చెందినదని, ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ గానీ లేదని చెబుతున్నారు వైద్యులు.