Breaking News

గొలనకొండ వేణుకు గౌరవ డాక్టరేట్

మన ప్రగతి న్యూస్/నర్సంపేట:

సామాజిక సేవా రంగంలో ఆర్టీసీ నర్సంపేట డిపో కండక్టర్ గొలనకొండ వేణుకు తెలుగు సంస్కృతి సాహితి సేవ ట్రస్టు “గౌరవ డాక్టరేట్”పురస్కారంతో హైదరాబాద్ లో ఆదివారం సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు డా. బాబూ మోహన్ చేతుల మీదుగా వేణు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన వేణు 17 సంవత్సరాల నుండి కండక్టర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉద్యోగంతో పాటు గత కొన్నేళ్ల నుండి చేస్తున్నటువంటి సామాజిక సేవలను గుర్తించి వారు ఈ పురస్కారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందించారు. కరోనా, క్యాన్సర్, గుండెపోటు… ఇలా వివిధ కారణాలతో చనిపోయిన, అనారోగ్యానికి గురైన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ముందడుగు వేసి ఉద్యోగుల సాయంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు లక్షల్లో ఆర్థిక సహాయం అందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సొంత గ్రామంలో తమ పిల్లల పుట్టిన రోజు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి జీవితాంతం దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టడం, గ్రామస్తుల సహాయంతో అనారోగ్యానికి గురైన వారిని ఆదుకోవడం, స్వచ్ఛందంగా రక్తదానం చేయడం తదితర సేవా కార్యక్రమాలు చేశారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక సృష్టించడమే కాకుండా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా వినూత్న కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆర్టీసీ జేఏసీ నాయకుడు, టీజేఎంయూ డిపో సెక్రటరీ, ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కోసం నిరహార దీక్షలు తదితర సుదీర్ఘ సమస్యల కొరకై వేణు విశేష కృషి చేశారు. ఆపదలోనున్న ఆర్టీసీ కుటుంబాలకు భవిష్యత్తులో “ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ కేర్ టీం మరియు గురిజాల విలేజర్స్ సెల్ఫ్ కేర్ టీం”లను ఏర్పాటు చేసి, “క్రౌడ్ ఫండింగ్” నిధుల ద్వారా అట్టి కుటుంబాలను లక్షల రూపాయలతో ఆదుకునే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల నర్సంపేట డీఎం కె. ప్రసూనలక్ష్మీ వేణును అభినందించింది. తోటి ఉద్యోగులు, గురిజాల గ్రామస్తులు, సన్నిహితులు మరియు స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ రావడం పట్ల సహకరించిన ప్రతి తోటి ఆర్టీసీ మిత్రులు, అధికారులు, గురిజాల గ్రామస్తులకు పేరు పేరున వేణు కృతజ్ఞతలు తెలిపారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్