చింతకింది కుమారస్వామి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండల కేంద్రంలో పేరుకుపోయిన మౌళిక సమస్యలను పరిశీలించడానికి ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డి తక్షణమేనల్లబెల్లిలో పర్యటించాలనీ చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రమైన నల్లబెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్, బీసీ నాయకులు మామిండ్ల అయిలయ్య, ఎండీ నన్నేసాహేబ్ కోల లింగయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ నల్లబెల్లి మెయిన్ రోడ్డు పొడవునా డ్రైనేజీ సిస్టం మొత్తం దెబ్బతిన్నదని గతంలో కట్టిన సైడ్ కాలువలు పూర్తిగా కూలిపోయి మట్టితో నిండిపోయి రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలతో నిండి పోయిందన్నారు. డివైడర్ సిస్టంతో వేసిన సిసి రోడ్డుకు బయట ఉండవలసిన విద్యుత్ స్తంభాలు కొలతల ప్రకారం రోడ్డుకు అవతల ఉండే విధంగా చర్యలు చేపట్టకుండానే యధావిధిగా స్తంభాలను అలాగే ఉంచి సీసీ రోడ్డు వేయడం వలన విద్యుత్ స్తంభాలు రోడ్డులో అస్తవ్యస్తంగా ఉండడం వలన వాహనదారులకు ఉండవలసిన రోడ్డు వెడల్పు వినియోగంలోకి రాక వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అంతే కాకుండా అంతర్గత రోడ్ల నిర్మాణం తగినంత వెడల్పుగా లేకపోవడం వలన ఒక వాహనం ఎదురైతే మరో వాహనం వెళ్లకుండా వెనక్కి రావలసిన పరిస్థితి ఉందన్నారు .అంతర్గత రోడ్లకు ఇరువైపులా సైడ్ కాలువలు లేకపోవడం వలన వర్షపు నీరు ఇండ్లలో చేరి వాడిన డ్రైనేజీ నీటితో దుర్గంగా మారిందన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ లో నాటిన చెట్ల మొక్కలు సంరక్షణ లేక ఎండిపోవడమే కాకుండా గ్రీనరీ స్థానంలో గడ్డి పిచ్చి మొక్కలతో నిండిపోయింది అన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలన్నారు. చుట్టూ 31 గ్రామపంచాయతీలు ఇతర మండలాలకు సంబంధించిన గ్రామాల ప్రజలు ప్రతిరోజు వ్యాపార వాణిజ్య అవసరాల కోసం మండల కేంద్రానికి రావడం వలన ప్రజలకు రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ అసౌకర్యంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం మండల కేంద్రంలో సంత ఉండటం మూలంగా సంతకు ప్రత్యేకంగా స్థలం లేకపోవడం వలన రోడ్డు మీదనే చిరు వ్యాపారులు సంతగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నడుపుకోవడం వలన సంతకు వచ్చే ప్రజల రద్దీతో రోడ్డు నడవడానికి ద్విచక్ర వాహనాలు కూడా పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలకు సోమవారం వచ్చిందంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. సంతను రోడ్డు మీద కాకుండా బయట ఏర్పాటు చేయడానికి కావలసిన స్థల సేకరణతో పాటు మంచినీరు, మరుగుదొడ్ల వసతులను కల్పించడానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది అన్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు చేతివృత్తుదారులకు ప్రతి మండల కేంద్రంలో 50 వ్యాపార కేంద్రాలను నిర్మించి వృత్తిదారుల సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం పండ్లు కూరగాయలు చికెన్ , చేపలు, సెలూన్ షాపులు, బంగారు వెండి నగలు, వడ్రంగి, కమ్మరి కుమ్మరి రజక చేతివృత్తులకు సంబంధించిన మడిగలను నిర్మించుటకు స్థల సేకరణ చేయుటకు గాను దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే నల్లబెల్లిని సందర్శించాలని ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని బీసీ సంఘ నాయకులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు.

