-ఇటీవలి వర్షాలతో నేలవాలిన పంటలు.
-బురదమయంగా పొలాలు.
-చైన్ హార్వెస్టర్లతో అదనపు ఖర్చు.
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.వానకాలం సీజన్ మొదటి నుంచి దెబ్బమీద దెబ్బ తాకుతున్నది.అష్టకష్టాలు పడి పంటలు సాగుచేస్తే చేతికందే దశలో పెట్టుబడులకు కూడా మునగాల్సి వస్తున్నది.పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే అకాల వర్షాలతో ఆశలు అడియాశలు అయ్యాయి.ఇటీవల వానలతో మానకొండూర్,తిమ్మాపూర్, శంకరపట్నం మండలాలలో ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోగా నేడో,రేపో కోసేందుకు సిద్ధంగా ఉన్న వందలాది ఎకరాల్లో వరి పంట నేలవాలాయి.వారం రోజులైనా ఎండకపోగా,అక్కడక్కడ బురదమయం అయ్యాయి.పొలాలను చూసిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ పరిస్థితుల్లో వరులు కోయించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.టైర్ల యంత్రాలతో కోసే పరిస్థితి లేకపోవడంతో రేటు ఎక్కువైనా అష్ట కష్టాలు పడి పండించిన పంట దక్కితే చాలని చైన్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు.అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు.
అదనపు భారం
టైర్ మిషన్ గంటకు కిరాయి 2800 ఉండగా,చైన్ మిషన్ నిర్వాహకులు మాత్రం గంటకు రూ.3500 నుంచి రూ.4వేల వరకు తీసుకుంటున్నారు.ఎకరం కోయాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతున్నది.దాదాపు ఎకరాన 7వేలు అవుతున్నది.టైర్ మిషిన్‌తో కోస్తే 5600 సరిపోయేది.రైతులకు ఎకరాకు 1400 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరోవైపు గిరాకీ ఎక్కువ ఉండడంతో మండలల లో చైన్ హార్వెస్టర్లు దొరకడం లేదు.కోతలు ఎక్కువయ్యే కొద్దీ హార్వెస్టర్లకు డిమాండ్ పెరుగుతున్నది.పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా రేట్ల పెరిగే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బురదగా మారిన పొలంలో వరి చైన్ మిషిన్ కోయడం ద్వారా పశువులకు గడ్డి లేకుండా పోతున్నది.నేలవాలిన వరిని కోయడానికి మిషిన్ పూర్తిగా వెనుకకు ముందుకు వెళ్లడం,గడ్డి పూర్తిగా నూర్పిడి అయిపోయి బురదలోనే కూరుకుపోతున్నది.పశుగ్రాసం చేతికిరాకుండా పోతున్నదాని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
వాన మా పొట్ట కొట్టింది
నాకున్న ఐదు ఎకరాలలో వరి సాగు చేసిన నాటి నుండి అరిగోస పడ్డ.పంట మంచిగా ఎదుగుతున్న సమయంలో యూరియా కోసం ఇబ్బందులు పడ్డ.ఇప్పుడు పంట చేతికొచ్చే దశల వర్షాలు పడి పంట పూర్తిగా నేలవాలింది.పంట మీద నుంచి వరద పోవడంతో పొలం బురదమయమైంది.కనీసం పెట్టిన పెట్టుబడన్న వస్తదని కోయించుదామనుకుంటే చైన్ హార్వెస్టర్లు దొరుకుత లేవు.వారం రోజుల తిరుగుతున్న అతి కష్టం మీద చైన్ హార్వెస్టర్ దొరికిందన్నారు.
– ఇజిగిరి ఐలయ్య,రైతు,
వంకాయగూడెం.
