Breaking News

పనుల్లో పొరపాటు వల్ల కేజీహెచ్ లో విద్యుత్ అంతరాయం

  • ఇది కేజీహెచ్ యాజమాన్యం, ప్రభుత్వ వైఫల్యం కాదు
  • వాస్తవాలు తెలుసుకొని స్టేట్మెంట్లు ఇవ్వాలి
  • జఫ్ఫా స్టేట్మెంట్లుతో రాజకీయం చేస్తే 11 సీట్లు కూడా రావు
  • క్రిటికల్ కేర్ వద్ద వాటర్ పనులు చేస్తుండగా తెగిన విద్యుత్ కేబుల్ లైన్లు
  • ఎమర్జెన్సీ యూనిట్లకు ఐదు జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా
  • విద్యుత్ అంతరాయం వల్ల ఎలాంటి సమస్యలు కలగలేదు…
  • సీరియస్ కండిషన్లో వచ్చిన దేవి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది….
  • ఆమె మృతికి విద్యుత్ పోవడానికి సంబంధం లేదు …
  • దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్..

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం:

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయని కింగ్ జార్జ్ ఆసుపత్రి పై దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. కేజీహెచ్ లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, రోగులు ఇబ్బందులు పడ్డారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆయన తీవ్రంగా స్పందించారు. కేజీహెచ్ క్రిటికల్ వార్డు వద్ద వాటర్ పైప్ లైన్ ముందుకు జరిపే పనులు కోసం గోతులు తీస్తుండగా జెసిబి బకెట్ తగిలి కిందనున్న విద్యుత్ కేబుల్ లైన్లు తెగిపోయాయని తెలిపారు. దీనివలన మధ్యాహ్నం రెండు నుంచి విద్యుత్ సరఫరా కొన్ని యూనిట్లకు నిలిచిపోయిందని వివరించారు. కేజీహెచ్ యాజమాన్యం వెంటనే స్పందించి వాటర్ పనులు చేస్తున్న ఏపీఎంఎస్ఐ డిసి నిర్వాహకులకు తెలియజేశారు. అలాగే విద్యుత్ శాఖ ఎస్ఈ, డిఈ ఏఈలకు సమాచారమిచ్చి రిపేర్లు చేయమని కోరారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించే విద్యుత్ కేబుల్ లైన్లు రిపేరు చేసే పనులను చేపట్టారు. ఈలోగా కేజీహెచ్ లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఉండేందుకు సిబ్బంది అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులకు ఐదు జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరాని అందించారు. రాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్ కేబుల్ రిపేర్లు పూర్తి చేసి విద్యుత్ పునరుద్ధరణ చేశారు. దీనివలన కేజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్న రోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దేవి అనే మహిళ సీరియస్ కండిషన్లో ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిందేతప్ప, విద్యుత్తు లేనందున మృతి చెందలేదని తెలియజేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసిపి నాయకులు నోటికి వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ముందుగా ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని లేదంటే జఫ్ఫాలు అయిపోతారని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికే వైసిపిని రాష్ట్ర ప్రజలు గంగలో కలిపేసారని గుర్తు చేశారు ఇలాంటి పనికిమాలిన అసత్య ఆరోపణలు చేస్తూ రోడ్లెక్కితే 11 సీట్లు కూడా రావని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. వాటర్ పనులు వల్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోతే ప్రభుత్వ వైఫల్యం అంటూ ప్రభుత్వంపై బురద చల్లుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బ్రష్టు పట్టించిన కేజీహెచ్ ను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఓర్వలేకే తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలకు దిగుతున్నారన్నారు. వైద్య, విద్యకు కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతినిస్తుందని అందులో ఎలాంటి సందేహము లేదని వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పనికిమాలిన రాజకీయాలతో అప్రతిష్ట పాలు కావద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు