ఆందోళనలో మండల ప్రజలు
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దొంగతనాల నివారణకు, దుండుగుల ఆచూకీ, పలు నేరాలను త్వరగా గుర్తించి అడ్డుకట్ట వేసి నేరస్తులకు గుర్తించడానికి మండలంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయి. ఏం జరిగినా అన్ని చోట్ల అమర్చిన సీసీ కెమెరాల సాయంతో తక్షణం పట్టుకుంటామని ప్రకటిస్తున్న పోలీసులకు అనుకోని కష్టం వచ్చి పడింది. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలకు చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఏర్పాటు చేయిస్తున్నారు. కానీ సీసీ కెమెరాల ఏర్పాటులో చూపించిన ఉత్సాహం, నిర్వాహణలో మాత్రం చూపించడం లేదు. దీంతో చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అంధకారంలో నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వీటి ఏర్పాటు వల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో చిన్న పాటి దొంగతనాలు అరికట్టబడ్డాయి. మండల కేంద్రంలో రోడ్డుపక్కన మద్యం సేవించే ఆకతాయిలకు,రాత్రి వేళల్లో రోడ్డుమీద విచ్చలవిడిగా తిరిగే ఆకతాయిలకు అడ్డుకట్ట పడినట్లు అయింది. అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయి. కానీ క్రమేణా మండల కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరాలు పగిలిపోవడం, మరి కొన్ని చోట్ల కేబుల్ తెగిపోవడం, విద్యుత్ స్థంబాలకు పెట్టినటువంటి బోర్డులో సర్వర్లు పాడై పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. మండల కేంద్రంలోని సీసీ కెమెరాలకు ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో కెమెరాలు పనిచేయడం లేదు. ఇప్పటికైనా పోలీసు అధికారులు, స్పందించి గ్రామాల్లో చెడిపోయిన సీసీ కెమెరాలను తిరిగి వినియోగంలోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు. కానీ కొన్నిచోట్ల పలు సీసీ కెమెరాలు మాయం అయ్యాయని సీసీ కెమెరాలు కి దొంగలు పడడం ఏంటని మండల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.